‘పట్టణ ప్రగతి’ని సవాల్‌గా తీసుకోండి

 ‘కొత్త మున్సిపల్‌ చట్టంలో పని చేసే ప్రజాప్రతినిధులకు బాధ్యతలతోపాటే గౌరవం ఉంది. నిర్లక్ష్యంగా పని చేసే చైర్మన్‌, కౌన్సిలర్లను పదవుల నుంచి తొలగించే అధికారం కలెక్టర్లకు ఉంది’ అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. బుధవారం జనగామ మున్సిపాలిటీ పరిధి 13, 30వ వార్డులోని దళిత వాడల్లో ఆయన పట్టణ ప్రగతిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కాలనీల్లో రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జనగామ జిల్లా కలెక్టర్‌ కే నిఖిలతో కలిసి కాలినడకన తిరుగుతూ ప్రజలు, మహిళలతో ముఖాముఖిగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఆసరా పింఛన్లు వస్తున్నాయా? సంక్షేమ పథకాలు అందుతున్నాయా? తాగునీరు, విద్యుత్‌ సరఫరా జరుగుతుందా? తడి, పొడి చెత్తబుట్టలు ఇచ్చారా? వాటిని మీరు వాడుతున్నారా? పారిశుద్ధ్య కార్మికులు మురుగు కాల్వలను శుభ్రం చేస్తున్నారా? అంటూ గృహిణులను మంత్రి కేసీఆర్‌ అడిగారు. చెత్తబుట్టలు మళ్లీ ఇస్తాం.. తడి, పొడి చెత్తను కార్మికులకు విడివిడిగా ఇవ్వండి.. మున్సిపల్‌ సిబ్బందికి కొత్తగా ఆటో రిక్షాలు, రిక్షాలు ఇస్తాం.. వాళ్లు వేర్వేరు డబ్బాల్లో పోయకుంటే ఇవ్వకండి అంటూ మహిళలకు అవగాహన కల్పించారు.