పన్నులు చెల్లించకపోతే చర్యలు...

పంచాయతీల్లో ఇంటి యజమానులు పన్ను చెల్లించకుంటే కొంత వెసులుబాటు కల్పించనున్నా ట్రేడ్‌ లైసెన్స్‌దారులు, నాన్‌టాక్స్‌ పరిధిలోకి వచ్చే వారిపై చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే నాంపల్లిలో ఓ రైస్‌ మిల్లు యజమాని పన్ను చెల్లించకపోతే ఆ రైస్‌ మిల్లును పంచాయతీ శాఖ యంత్రాంగం సీజ్‌ చేసింది. ఇక ట్రేడ్‌ లైసెన్స్‌ కింద పన్నులు చెల్లించే వారి లైసెన్స్‌లు సైతం రద్దు చేయనున్నారు. అదేవిధంగా జీపీల్లో చేపల చెరువులు, సంతలు, దేవాలయాల్లో కొబ్బరికాయల వేలం పాటలు, ఇతర వేలానికి సంబంధించి రాశాల్సిన పన్నుల విషయంలోనూ నిర్లక్ష్యం వహిస్తే కేసులు నమోదు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. నూతన పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం పన్నుల వసూళ్లను ప్రభుత్వం నిరంతరం సమీక్షిస్తుండటంతో స్థానిక సిబ్బందిపై ఒత్తిడి పెరిగి వసూళ్లపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. గతేడాది స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో 71 శాతం పన్నులు వసూలు కాగా ఈసారి పూర్తిస్థాయిలో చేసేలా ప్రణాళికలు రూపొందించారు.