అభివృద్ధి అద్భుతం

హైదరాబాద్‌ అభివృద్ధి మహాద్భుతమని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ కార్యదర్శి అజయ్‌ప్రకాశ్‌ సాహ్నీ అన్నారు. ఇక్కడ ట్రిపుల్‌ ఐటీ, టీహబ్‌ వంటి సంస్థలతోపాటు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐటీ కంపెనీలు నెలకొనడం గొప్ప విషయమని ప్రశంసించారు. ఒకప్పుడు 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో సైబర్‌టవర్‌ నెలకొల్పితే.. ఇప్పుడు ఏడున్నర కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణానికి ఐటీ కంపెనీల విస్తరణ జరిగిందని కొనియాడారు. తెలంగాణకు గొప్ప ఆస్తి ఇక్కడి టాలెంట్‌ అని, గ్లోబల్‌ ఐటీకి కావాల్సిన దానికంటే ఇక్కడ తక్కువేంలేదని, అందుకే ప్రపంచంలోని గొప్ప కంపెనీల్లో ఇక్కడివారు కీలకపాత్ర పోషిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌లోనూ ఆ స్థాయి కంపెనీల్లో ఇక్కడివారు సేవలందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 


రాష్ట్ర ప్రభుత్వం, డాటా సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (డీఎస్‌సీఐ) సంయుక్తంగా హైదరాబాద్‌లోని మంజీరా ట్రినిటీ కార్పొరేట్‌లో ఏర్పాటుచేసిన సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ని తెలంగాణ ఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్‌, నేషనల్‌ సైబర్‌ సెక్యూరిటీ కోఆర్డినేటర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ రాజేశ్‌ పంత్‌, సైయంట్‌ చైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డితో కలిసి ఆయన మంగళవారం ప్రారంభించారు. అనంతరం అజయ్‌ప్రకాశ్‌ మాట్లాడు తూ.. భవనాలు, మౌలిక వసతుల కంటే కూడా గొప్ప టాలెంట్‌ ఉండటం అతి ముఖ్యమైన వన రు అని అన్నారు. హైదరాబాద్‌ యువతకు ఉన్నత లక్ష్యాలు, ఉన్నత ఆశయాలు, ఉన్నత పోటీని ఎదుర్కోవటం అలవాటు చేశారని, దీం తో అనుకున్నదానికంటే ఎక్కువ టాలెంట్‌ ఉన్నవారు దేశంలోకెల్లా హైదరాబాద్‌లో లభిస్తున్నారని, ఎలాంటి చాలెంజ్‌లను ఇచ్చినా ఎదుర్కొనేలా తయారయ్యారని కొనియాడారు.